భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్ పార్టీకి చెందిన 11 మంది ఆదివారం ఒడిశా రాష్ట్రంలోని కలహండి పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఒకరు డివిజనల్ కమిటీ మెంబర్, నలుగురు ఏరియా కమిటీ సభ్యులు, ఆరుగురు ప్రాంతీయ కమిటీ సభ్యులు ఉన్నారు.
వీరు ఒక ఏకే47, నాలుగు ఎస్‌ఎల్‌ఆర్‌లు, ఒక ఇన్సాస్, ఒక 12 బోర్ తుపాకీ, 2 సింగల్ షాట్ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారంతా చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ దండకారణ్యానికి చెందినవారని, వీరిపై రూ.1.34 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.
నాలుగు ఐఈడీలు నిర్వీర్యం
చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన నాలుగు ఐఈడీలను భద్రతాబలగాలు నిర్వీర్యం చేశాయి. చోటేబేటియా పీఎస్ పరిధిలోని హాపటోలా-బినాగూడ గ్రామ అడవుల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్లు రెండు రోజులుగా కూంబింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టుల ఏర్పాటు చేసిన మందుపాతరలు కనిపించాయి. దీంతో వాటిని నిర్వీర్యం చేయగా.. అదే ప్రదేశంలో ఇతర పేలుడు పదార్థాలు, నిత్యావసర వస్తువులు, విప్లవ సాహిత్యంలతో కూడిన డంప్ బయటపడింది.
